సూర్యదేవర నాగవంశీ నిర్మించిన మ్యాడ్ స్కేర్ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నాగవంశీ విలేకరులతో ముచ్చటించారు. రివ్యూ అనేది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దాన్ని వ్యక్తం చేయడంలో తప్పులేదు. నిజాయితీగా ఇచ్చే రివ్యూలను గౌరవిస్తాం. కానీ కొందరు సినిమాను చంపేయాలనే ఉద్దేశ్యంతో రివ్యూలు రాస్తున్నారు. అంతటితో ఆగకుండా అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అది తప్పు. సినిమా బతికితేనే, అందరం బాగుంటాం అనే విషయాన్ని వారూ గ్రహించాలి అంటూ ఘాటుగా స్పందించారు.

నాలుగు రోజుల్లోనే పంపిణీదారులంతా లాభాలబాట పట్టారు. తొలివారం టికెట్ రేట్లు పెంచాం. మంగళవారం నుంచి మాత్రం అన్ని చోట్లా సాధారణ ధరలే ఉంటాయి. కుటుంబ ప్రేక్షకులకు సినిమాను మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని నాగవంశీ పేర్కొన్నారు. భారీ బడ్జెట్ సినిమా కాకపోయినా తమ సినిమాకు జనం బ్రహ్మరథం పడుతున్నారని, దానికి వినోదమే కారణమని, ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్‌నే ఆడియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారని నాగవంశీ అభిప్రాయపడ్డారు. నాలుగురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 70కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ఆయన తెలిపారు.
