
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమిపైకి తిరిగొచ్చారు. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వారు బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఆస్ట్రోనాట్స్ భూమికి చేరారు.

ఇక సునీత రాక సందర్భంగా మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను ఇంతకంటే ముందుగానే తిరిగి తీసుకొస్తామని స్పేస్‌ఎక్స్ ప్రతిపాదిస్తే అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ తిరస్కరించారని అన్నారు. రాజకీయ కారణాలతో వద్దని అన్నారని ఆరోపించారు. ఇంతకంటే ముందుగానే వ్యోమగాములను తిరిగి తీసుకొస్తామని ఆఫర్ చేశాము. అందులో సందేహమే లేదు. వాస్తవానికి ఆస్ట్రొనాట్స్ 8 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి రావాలి. కానీ దాదాపు 10 నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. స్పేస్ ఎక్స్ వారికి కొద్ది నెలల్లోనే తిరిగి తీసుకొచ్చి ఉండేది. ఈ ప్రతిపాదనను మేము బైడెన్ ప్రభుత్వం ముందు ఉంచాం. కానీ ఆయన మా ప్రతిపాదనను తిరస్కరించారు. రాజకీయ కారణాలతో బైడెన్ ప్రభుత్వం మా ప్రతిపాదనకు ఒప్పుకోలేదు అని మస్క్ ఆరోపించారు.
