చేనేతల అభివృద్ధి కోసం తాము చాలా చేశామని, అయినా సరిపోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చేనేత వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని, ఇందుకు సంబంధించి త్వరలోనే ఓ శుభవార్త చెబుతానని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… చేనేత వర్గం సమున్నతంగా బతికేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. చేనేతలను బాధల నుంచి విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
ఎల్. రమణ నిబద్ధుడు….
ఎల్. రమణ నిబద్ధత గల నేత అని కేసీఆర్ ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహకరించడానికే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. రమణకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు.. రమణకు చేనేతల బాధ్యత అప్పగిస్తామని, ఆయనతో సహా వచ్చిన వారందరికీ మంచి పదవులు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. రైతు బీమాలాగా చేనేతలకు కూడా ఓ బీమాను వర్తింప జేస్తామని, అతి త్వరలోనే అమలు కూడా చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని గాడీలో పెట్టడానికే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతోందని కేసీఆర్ వివరించారు. తెలంగాణ సిద్ధిస్తే ధనిక రాష్ట్రంగా మారిపోతుందని గతంలోనే ప్రకటించామని, ఇండియాలోనే నెంబర్ వన్ జీతాలు ఇస్తామని చెప్పామని, అది జరుగుతోందన్నారు. కోకాపేట భూములు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను పేదల కోసమే ఖర్చు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.