కేంద్ర ప్రభుత్వ పరిధిలో జాతీయ విధానాలు రూపుదిద్దుకుంటున్నా భారత సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు పలు అంశాల్లో స్వయం ప్రతిపత్తిని గణనీయంగా పెంచుకుంటున్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగిన యాంబిషన్ ఇండియా 2021 వాణిజ్య సదస్సులో కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. సెనేట్ సభ్యులతో పాటు స్థానిక వాణిజ్య, రాజకీయ వర్గాల ప్రముఖులు పాల్గొన్న ఈ సదస్సులో కోవిడ్ తదనంతర కాలంలో భారత్, ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్తుకు కార్యాచరణ అంశంపై మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, సాధించిన అభివృద్ధిని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలోని పారిశ్రామిక వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలను వివరించారు. ఫ్రెంచ్ కంపెనీల కోసం, ముఖ్యంగా ఎస్ఎంఈల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు 15 రోజుల వ్యవధిలో సులభవంగా లభించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ వద్ద రెండు లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవ వనరులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా సొంత ఖర్చుతో శిక్షణ ఇస్తోందని తెలిపారు. పెట్టుబడులతో ముందుకువచ్చే సంస్థల ఆకాంక్షలకు అనుగుణంగా వసతులు సమకూరుస్తామన్నారు. యాంబిషన్ ఇండియా 2021 సదస్సులో తెలంగాణను భాగస్వామ్య రాష్ట్రంగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతుల తెలిపారు.