తైవాన్‌కు భద్రత కల్పించేందుకు అవసరమైతే అమెరికాతో కలిసి పని చేస్తామని ఆస్ట్రేలియా ప్రకటించింది. తైవాన్ చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా రక్షణశాఖ మంత్రి పీటర్ డట్టన్ తెలిపారు. తైవాన్ను రక్షించేందుకు చర్యలు తీసుకునేందుకు అమెరికా ముందుకు వస్తే, ఆ దేశాలతో తాము చేరకపోవడం అనూహ్యమే అవుతుందని తెలిపారు. తైవాన్ విషయమై చాలా నిజాయితీగా ఉండాలని భావిస్తున్నామన్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న పరిణామాల వల్ల తాము ముందుకు రాలేకపోవచ్చునని చెప్పారు. కానీ అలా జరుగుతుందని ఊహించలేనన్నారు. తైవాన్ను స్వాధీనం చేసుకునేందుకు చైనా స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. చైనాను ఎదుర్కొనేందుకు భారీ స్థాయిలో సన్నద్ధం కావాలని తెలిపారు.














