రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై సరిగ్గా రెండేండ్లు గడిచాయి. అయితే ఈ సుదీర్ఘ యుద్ధం ముగిసేది ఎప్పుడు? గెలిచేది ఎవరు? అనేదానిపై స్పష్టత కనిపించడం లేదు. యుద్ధం ఉక్రెయిన్ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. తమ లక్ష్యాలను సాధించిన తర్వాతే యుద్ధానికి ముగింపు ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. 2022, ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించింది.
రష్యా సైన్యం దాడులు ఉక్రెయిన్ బలగాల ప్రతి దాడులతో ఇది భీకర యుద్ధంగా మారింది. ఇరువైపులా వేలాదిగా సైనికులు, సాధారణ పౌరులు మరణించగా, అంత కంటే ఎక్కువ సంఖ్యలో గాయపడ్డారు. మరణాల సంఖ్యపై రెండు దేశాలు అధికారిక ప్రకటనలు చేయకపోవడంతో, మృతిచెందిన వారి సంఖ్యపై స్పష్టత లేదు. కాగా, యుద్ధంలో రష్యా వైపు 1,20,00 మంది సైనికులు మరణించగా, దాదాపు 1,80,000 మంది గాయపడ్డారని అమెరికా రక్షణశాఖ అధికారులు ఇటీవల పేర్కొన్నారు. అదేవిధంగా 70 వేల మంది ఉక్రెయిన్ జవాన్లు మరణించగా, లక్ష మందికి పైగా గాయపడ్డారని తెలిపారు.