
విదేశాలపై టారిఫ్‌లు, ఆంక్షల విధింపునకు సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ నిర్ణయాలు నిజమేనని చెప్పారు. శక్తిమంతమైన దేశంగా మారే క్రమంలో వాణిజ్య సంబంధాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైసీనా డైలాగ్ – 2025లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ దేశాలపై సుంకాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాణిజ్య పరిమితులు, టారిఫ్‌లు, ఆంక్షలు వంటి వాటికి భారత విదేశాంగ విధానంలో చోటుందా? అని కేంద్ర మంత్రికి ప్రశ్న ఎదురైంది. దానికి బదులిస్తూ మీరు నమ్మినా నమ్మకపోయినా, సుంకాలు, ఆంక్షలు అనేవి వాస్తవ అంశాలు. దేశాలు వాటిని అమలుచేస్తున్నాయి. నిజానికి గత దశాబ్దాన్ని గమనించినట్లయితే గొప్ప ఆయుధీకరణను చూశాం. ఆర్థిక ప్రవాహం, ఇంధన సరఫరా, సాంకేతికత బదిలీ పెరగడం చూశాం. ఇదే ప్రపంచంలో జరుగుతున్న వాస్తవం. ఓ దేశం సమగ్ర జాతీయశక్తిగా ఎదిగే పోరాటానికి వ్యాపార, వాణిజ్య సంబంధాలు ముఖ్యమైన సహకారాన్ని అందిస్తాయి. అందుకే వాణిజ్య, వ్యాపార సంబంధాల కోసం దేశాలు పోటీపడుతున్నాయి అన్నారు.
