
డోనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం నేపథ్యంలో ఇండియాపై శ్వేత సౌధం కీలక ఆరోపణ చేసింది. అమెరికా మద్యం, వ్యవసాయ ఉత్పత్తులపై, భారత్ అధిక స్థాయిలో సుంకాలు వసూల్ చేస్తున్నట్లు చెప్పింది. అమెరికన్ మద్యంపై భారత్ 150 శాతం దిగుమతి సుంకాన్ని వసూల్ చేస్తున్నట్లు వైట్‌హౌజ్ ప్రెస్ కార్యదర్శి కరోలిన్ లివిట్ తెలిపారు. అమెరికా వస్తువులపై వివిధ దేశాలు విధిస్తున్న సుంకాలకు సంబంధించిన గణాంక వివరాలను ఆమె వైట్‌హౌజ్‌లో మీడియాకు వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ అమెరికా మద్యంపై ఇండియా భారీగా సుంకాన్ని వసూల్ చేస్తుందన్నారు.

కెనడాతో జరుగుతున్న ట్రేడ్ వార్ గురించి ప్రశ్న వేయగా ఆమె ఇండియాపై కూడా రియాక్ట్ అయ్యారు. అమెరికాను, దేశానికి చెందిన హార్డ్ వర్కింగ్ అమెరికన్లను కూడా కెనడా మోసం చేస్తోందన్నారు. అమెరికా ప్రజలు, వర్కర్లపై కెనడా సర్కారు అత్యధిక స్థాయిలో టారిఫ్‌లు వసూల్ చేస్తున్నట్లు ప్రెస్ సెక్రటరీ ఆరోపించారు. కెనడా, భారత్, జపాన్ లాంటి దేశాలు వసూల్ చేస్తున్న సుంకాలకు చెందిన ఛార్ట్‌ను ఆమె ప్రజెంట్ చేశారు. అమెరికాకు చెందిన చీజ్, బటర్‌పై 300 శాతం సుంకాన్ని కెనడా వసూల్ చేస్తున్నట్లు ఆరోపించారు.
