చైనాలో ఉన్న వుహాన్ ల్యాబ్ నుంచే కోవిడ్ వైరస్ లీకైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వాదనలు మళ్లీ బలం పుంజుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కోవిడ్19 ఆనవాళ్ల గురించి ఎటువంటి సమాచారం తెలిసినా, ఆ విషయాన్ని తమతో పంచుకోవాలని ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్‌వో కోరింది. ఎఫ్బీఐ రిపోర్టు నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ స్పందించారు. ఏ దేశం వద్దనైనా కోవిడ్ ఆనవాళ్లకు సంబంధించిన సమాచారం ఉంటే, దాన్ని డబ్ల్యూహెచ్‌వో కు ఇవ్వాలని టెడ్రోస్ కోరారు. కోవిడ్ మహమ్మారి ఆనవాళ్లను గుర్తించే పనిలో డబ్ల్యూహెచ్‌వో ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు. వుహాన్ ల్యాబ్ నుంచి కోవిడ్ లీకైనట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఎఫ్‌బీఐ వద్ద దీనికి సంబంధించిన సమాచారం ఉందని డైరక్టర్ క్రిస్టోఫర్ వ్రే తెలిపారు. చైనా అధికారులతో పలుమార్లు చర్చించినట్లు కూడా టెడ్రోస్ తెలిపారు. కోవిడ్ గురించి ఎటువంటి డేటా ఉన్నా షేర్ చేయాలని చైనాను కోరినట్లు టెడ్రస్ చెప్పారు. 2019లోనే తొలిసారి చైనా నగరం వుహాన్ నుంచి వైరస్ లీకైనట్లు అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎఫ్‌బీఐ చేసిన ఆరోపణలను చైనా అధికారులు ఖండించారు. తమ దేశంపై అమెరికా అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లు డ్రాగన్ ఆరోపించింది.