Skip to main content

Namaste NRI

ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది?.. దీని వెనుక సైబర్‌ దాడి ఉందా?

అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నట్టుండి విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. అసలు విమానయాన రంగంలో ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది? దీని వెనుక సైబర్‌ దాడి ఉందా? 9/11 తరహా ఉగ్రదాడి ముప్పు ఏమైనా ఉందా? లేక ఇటీవల మైక్రోసాఫ్ట్‌ సేవల్లో తలెత్తిన అంతరాయంతో సంబంధముందా? అనే సందేహాలు జనాల్లో మొదలయ్యాయి. ఈ అనుమానాలపై అమెరికా అధికారులు స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు సైబర్‌ దాడికి సంబంధించిన ఆధారాలేవీ లేవని, పాత టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపమే విమానాల నిలిపివేతకు ప్రాథమిక కారణమని వెల్లడించారు.

విమానాల రాకపోకలను నియంత్రించే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలో ఉపయోగిస్తున్న పాత టెలికమ్యూనికేషన్‌ పరికరాలపై ఒక్కసారిగా అధిక డేటా భారం పడిందని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్‌ డఫీ వివరించారు. దీంతో స్విచ్‌లు, రౌటర్లు సరిగా పనిచేయక సమాచార ప్రసారంలో అసమానతలు ఏర్పడ్డాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌, రాడార్‌ వ్యవస్థల పనితీరుపైనా ప్రభావం పడిందన్నారు. విమానాల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు అధికారులు దేశవ్యాప్తంగా విమానాల బయలుదేరడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని డఫీ అభిప్రాయపడ్డారు.

ఇందుకు అవసరమైన నిధులను కేటాయించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాంగ్రెస్‌ను కోరినట్లు తెలిపారు. కీలకమైన విమానయాన వ్యవస్థకు తాత్కాలిక మరమ్మతులు సరిపోవని, పాత పరికరాల స్థానంలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదని, అమెరికా ప్రజల భద్రతకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events