అమెరికన్ డాలర్‌ను వదిలివేయాలని బ్రిక్స్ యోచిస్తున్నదా? డాలర్‌కు ప్రత్యామ్నాయాన్ని ఈ కూటమి కనుగొనగలదా? ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శిఖరాగ్ర సదస్సు కోసం బ్రిక్స్ నాయకులు ఈ వారాంతంలో ఢిల్లీలో సమావేశమవుతున్న తరుణంలో ఈ కీలక ప్రశ్నలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. 2025 బ్రిక్స్ ప్రకటన అమెరికా డాలర్‌ను నేరుగా ప్రస్తావించకుండా దానికి బదులుగా స్థానిక కరెన్సీలలో ఆమోదయోగ్యమైన ఆర్థిక సహాయ యంత్రాంగాల కోసం పిలుపునిచ్చింది.

ఇది సరిహద్దు వాణిజ్య, ఆర్థిక రంగంలో డాలర్ ఆధిపత్యంపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడానికి ఈ కూటమి చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు సంకేతం. ఉమ్మడి బ్రిక్స్ కరెన్సీని గానీ లేదా డాలర్‌ను భర్తీ చేసే ఉద్దేశపూర్వక అజెండాను గానీ తాము సమర్థించడం లేదని పదేపదే స్పష్టం చేసినప్పటికీ ఈనెల 12, 13 తేదీలలో సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న భారత్ తన బ్రిక్స్ భాగస్వాములతో డీ-డాలరైజేషన్(డాలర్ రహిత ఆర్థిక వ్యవస్థ)పై చర్చించే అవకాశం ఉందని తెలుస్తున్నది.















