బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హసీనా మాట్లాడుతూ నేను నా మాతృభూమికి తిరిగి వస్తా, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటా అంటూ ప్రతిజ్ఞ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కాస్త ఓపికగా ఉండాలని సూచించారు. త్వరలోనే బంగ్లాదేశ్కు తిరిగి వచ్చి, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానన్నారు. గతంలో మాదిరిగానే అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. జులై , ఆగస్టుల్లో విద్యార్థుల ఆందోళనల్లో అనేక మంది మరణించారని, పలువురు పోలీసులు, అవామీ లీగ్ కార్యకర్తలు, విద్యావంతులు, కళాకారులు హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఈ హత్యలకు కారణమైన వారిపై యూనస్ ఎందుకు చర్యలు తీసుకోలేదని హసీనా ప్రశ్నించారు.
