విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అంజలి, నేహాశెట్టి కథానాయికలు. కృష్ణచైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇండస్ట్రీలో నాకు నచ్చే వ్యక్తుల్లో విశ్వక్‌సేన్ ఒకడు. నాలాగే విశ్వక్ వర్క్‌హాలిక్. అతని ఉడుకురక్తం, దూకుడుతనం నాకిష్టం. ఈ సినిమా ట్రైలర్‌లో అవి కనిపిస్తున్నాయ్. త్వరలో ఓ మంచి వార్త చెబుతా. ఊహించని కాంబోని మీరంతా చూడబోతున్నారు అని అన్నారు. వచ్చే యువతరానికి విశ్వక్‌సేన్ లాంటి హీరోలే ప్రేరణ. నన్ను కాదు ఇప్పుడున్న యువహీరోలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకో అని మా మోక్షజ్ఞకు కూడా చెబుతుంటాను. మంచి టీమ్ పనిచేసిన ఈ సినిమా విజయం సాధించడం ఖాయం. సినిమా చూసి విజయోత్సవ సభలో మాట్లాడతా అన్నారు.
విశ్వక్‌సేన్ మాట్లాడుతూ ఫైట్ ప్రాక్టీస్ చేస్తూ లారీపై నుంచి కిందపడ్డా. దేవుడి దయవల్ల ఏం కాలేదు. ఆ టైమ్‌లో బాలయ్యగారు కాల్ చేశారు. బాధ పడ్డారు. కంగారు పడ్డారు. కుటుంబసభ్యులు తర్వాత నాపై అంత ప్రేమ చూపించారు. లవ్‌యూ సార్. తెలుగోడి ఆత్మగౌరవం ఎన్టీయార్‌గారు. ఆయన ఫొటో పెట్టే ఈ సినిమా స్టార్ట్ చేశాం. అనుకోకుండా ఈ వేడుక కూడా ఆయన పుట్టినరోజే జరగడం యాదృశ్చికం. అయిదేళ్లు నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఎలాంటి సినిమా చేయాలని కోరుకున్నానో అలాంటి కథ నా దగ్గరకు తెచ్చాడు కృష్ణచైతన్య. నా కెరీర్‌లో బెస్ట్ ప్రొడ్యూసర్స్ నాగవంశీ, సాయిసౌజన్య. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నిజాయితీగా పనిచేశాం. మే 31న ఫ్యామిలీతో రండి అని నమ్మకంగా చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది.