కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆయనకు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించడం గమనార్హం. తన అనుచరులు, హుజూరాబాద్ కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో వచ్చి, టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… కౌశిక్ రెడ్డి యువకుడని, టీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులను సాదరంగా పార్టీకిలోకి ఆహ్వానిస్తు్న్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలన్న దృక్పథంతోనే ఆయన టీఆర్‌ఎస్ వైపు వచ్చారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పోటీ సర్వసాధారణమని, పార్టీలు గెలవడం, ఓడడం సాధారణమని పేర్కొన్నారు. ఇదేమీ రాచరిక వ్యవస్థ కాదన్నారు. కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ తనకు చిరకాల మిత్రుడని, గతంలో కలిసే పనిచేశామని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజలు కోరుకునేది తాము చేస్తామని, ఒక్కో పథకం వెనుక, ఎంతో మథనం ఉంటుందని అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఇకపై కరెంట్ పోదని పేర్కొన్నారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ నెంబర్ వన్ అయిందని, గొర్రెల పంపిణీ అంటే పప్పు, బెల్లం లాంటి పథకం కాదని స్పష్టం చేవారు.
దళితులకు 10 లక్షల స్కీం వెనుక మంచి ఉద్దేశం ఉందని, దళిత బంధు కోసం హుజూరాబాద్‌నే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని స్పష్టం చేశారు. మొదటి సింహ గర్జన కూడా అక్కడి నుంచే ప్రారంభమైందని పేర్కొన్నారరు. విమర్శలకు భయపడి, నిర్మాణాత్మకంగా పనిచేసే వాళ్లం తమ ప్రస్తానాన్ని ఆపమని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజలు గర్వంగా, సగౌరవంగా బతకాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ అన్నారు.