సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల హీరో హారోయిన్‌గా నటించిన చిత్రం మా ఊరి పొలిమేర-2. డా॥ అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. గౌరికృష్ణ నిర్మాత. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల పాత్రికేయులతో ముచ్చటిస్తూ ఈ సినిమా తొలి భాగాన్ని చూడని వారు వెంటనే చూసేయండి. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే రెండో భాగం మొదలవుతుంది. ప్రతి పది నిమిషాలకు ఓ సర్‌ప్రైజ్‌తో సినిమా ఆసాంతం ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది అని చెప్పింది. ఈ సినిమాలో నేను నాయికగా నటిస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఓ దర్శకురాలి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ సినిమాను అద్భుతంగా తీశారనిపించింది.
నేను పోషించిన లక్ష్మీ పాత్రతో ప్రేక్షకులందరూ కనెక్ట్ అవుతారు. ఆ క్యారెక్టర్‌లో కాస్త కోపంగా ఉంటూనే అన్ని రకాల ఎమోషన్స్ పండించే అవకాశం దక్కింది. నేను మెడిసిన్ చదివి యాక్టింగ్ ప్రొఫెషన్‌ను ఎంచుకున్నా. నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. చలం రచనలను ఇష్టపడతాను. బుక్స్ బాగా చదువుతాను. కె.విశ్వనాథ్‌గారి సినిమాల్ని బాగా చూస్తాను. ఈ అభిరుచులే నటనతో పాటు దర్శకత్వ శాఖపై ఆసక్తిని పెంచాయి. 2018లో మిస్ ఇండియా నుంచి నా ప్రయాణం మొదలైంది. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించా. అయితే ఈ ఏడాది విజయాలతో నాకు మంచి గుర్తింపు దక్కింది. పరిశ్రమలో మా బంధువులు చాలా మంది ఉన్నారు. అయినా ఇంతవరకు ఎవరి సహాయం తీసుకోలేదు. కెరీర్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకొని ముందుకుసాగుతున్నా అని చెప్పింది. ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది.