ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022`23లో భారతదేశ జీడీపీ అంచనాలపై ప్రపంచ బ్యాంక్ కీలక అంచనాలను విడుదల చేసింది. అధిక ద్రవ్యోల్బణం, సరఫరా అవరోధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ మందగిస్తుందని, దీంతో వృద్ధి రేటు అంచనాల్ని తగ్గిస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022`23 లో భారత్ ఆర్థికాభివృద్ధి 7.5 శాతానికి కుదించింది. వృద్ధి అంచనాల్లో ప్రపంచ బ్యాంక్ కోత విధించడం వరుసగా ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో 2022`23 ఆర్థిక సంవత్సరానికి 8.7 శాతం వృద్ధి రేటును అంచనా వేసిన బ్యాంక్ ఏప్రిల్ నెలలో 8 శాతానికి దించింది. ప్రస్తుతం దీనిని 7.5 శాతానికి తగ్గించింది. 2023`24 నుంచ వృద్ధి మరింతగా 7.1 శాతానికి తగ్గుతుందని, దీర్ఘకాలంపాటు ఇదేస్థాయిలో భారత్ వృద్ధి చెందవచ్చని ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఎకనామిక్ ప్రొస్పెక్ట్స్‌పై తాజాగా విడుదల చేసిన రిపోర్ట్‌లో వివరించింది. ప్రైవేట్ రంగం నుంచి వస్తున్న స్థిర పెట్టుబడులు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, ప్రోత్సాహకాలు దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడతాయని పేర్కొంది. మరోవైపు గత నెలలో బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 4.40 శాతానికి పెంచి ఆర్‌బీఐ రానున్న మానిటరీ పాలసీ రివ్యూలో మరోసారి వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి.