ఈ ఏడాది చివర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ నేత జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య గట్టి పోటీనే ఉంది. దీంతో ఇరువురు నేతలు ప్రచార జోరు పెంచారు. ఈ క్రమంలోనే అధ్యక్షు డు బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలవకూడదని ప్రపంచ నేతలు తనతో చెప్పా రని అన్నారు. అలా జరిగితే ప్రజాస్వామ్య దేశాలకు ప్రమాదకరమని వారు భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం న్యూయార్క్‌లో నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. నవంబరు లో తాను ఓడిపోతే రక్తపాతమే అని ట్రంప్ చెబుతున్నారు. ఇది అత్యంత ఆందోళనకర అంశం. ఈ మధ్య నేను ఏ దేశాధినేతను కలిసినా వారు ఒకటే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ( ట్రంప్) గెలవ నివ్వకండి అని అడుగుతున్నారు. భారత్‌లో జరిగిన జీ20 సదస్సులోనూ దాదాపు ప్రతీ ప్రపంచ నేత ఇదే కోరారు. ఆయన గెలిస్తే వారి ప్రజాస్వామ్యాలు ప్రమాదంలో పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు అని అన్నారు.