అమెరికాకు చెందిన అథ్లెట్ జియాన్ క్లార్క్ పుట్టుకతోనే వికలాంగుడు. రెండు కాళ్లు లేవు. కావ్డల్ రిగ్రెసివ్ సిండ్రోమ్ అనే రుగ్మతవల్ల అతనికి వెన్నుపూస కింది భాగం ఎదగలేదు. అయినా అతను తాను వికలాంగుడినని బాధపడుతూ కూర్చోలేదు. ఆయనలో ఆత్మవిశ్వాసం ఏ మాత్రం సన్నగిల్లలేదు. కాళ్లు లేకపోయినా చేతుల మీద నడక ప్రాక్టీస్ చేశాడు. పాల్గొన్న ప్రతి పోటీలో విజేతగా నిలుస్తూ వచ్చాడు. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టాడు. ఆఖరికి ప్రపంచంలోనే చేతుల మీద అత్యంత వేగంగా నడిచే అథ్లెట్గా గిన్నిస్ రికార్డు సృష్టించాడు.
జియాన్ క్లార్క్ 2021లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓ రేసులో 20 మీటర్ల దూరాన్ని కేవలం 4.78 సెకన్లలో చేరుకున్నాడు. అదే ఇప్పుడు చేతులపై అత్యంత వేగవంతమైన నడకగా రికార్డుల్లో ఉన్నది. ఆ రికార్డు నడకకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డు వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్ సంచలనంగా మారింది.