ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ మరో ఘనత సాధించారు. ఒక్క రోజులోనే ఆయన సంపద 3,620 కోట్ల డాలర్ల (దాదాపు రూ.2,71,500 కోట్లు) పెరిగి 28,900 కోట్ల డాలర్లకు (సుమారు రూ.21.68 లక్షల కోట్లు) చేరుకుంది. టెస్లా నుంచి లక్ష కార్లు కొనుగోలు చేయబోతున్నట్లు కార్ల అద్దెకిచ్చే కంపెనీ హెర్జ్ ప్రకటిచింది. దాంతో టెస్లా షేర్లు 15 శాతం మేర ఎగబాకి 1,045 డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ తొలిసారిగా లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని దాటింది. టెస్లాలో 23 శాతం వాటా కలిగిన మస్క్ వ్యక్తిగత సంపద కూడా అమాంతం ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా ఒక పారిశ్రామికవేత్త ఒక్కరోజు సంపద పెరుగుదలలో ఇప్పటి వరకిదే అత్యధికం. ప్రస్తుతం మస్క్ ప్రపంచ నం.1. ధనవంతుడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆయన సపంద 11,900 కోట్ల డాలర్లు(70) శాతం పెరిగింది. అంతేకాదు, ప్రపంచంలో 20,000 కోట్ల డాలర్లకు పైగా ఆస్తి కలిగిన ఏకైక వ్యక్తి మస్క్.