ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2025లో నిర్వహించే తానా 24వ మహాసభలకు వేదికగా డిట్రాయిట్ నగరాన్ని ఎంపిక చేయడంతోపాటు, ఈ మహాసభలకు కో ఆర్డినేటర్గా ఉదయ్ కుమార్ చాపలమడుగును నియమించినట్లు తానా కార్యదర్శి రాజా కసుకుర్తి తెలిపారు. ఈ మేరకు బోర్డ్, ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
తానా 2025 మహాసభలు జరిగే ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు నియమించిన ముగ్గురితో కూడిన కమిటి ఇచ్చిన నివేదికను ఈ సమావేశంలో ఆమోదించారు. ఈ కమిటీకి చైర్మన్ గా శ్రీనివాస్ కోనేరు వ్యవహరించారు. సభ్యులుగా నరహరి కొడాలి, శ్రీనివాస్ దాసరి ఉన్నారు. 2025 జూలై మొదటివారంలో ఈ మహాసభలు డిట్రాయిట్ లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
ప్రతి పదేళ్ళకు ఓసారి డిట్రాయిట్లో మహాసభలు జరగడం ఆనవాయితీగా కనిపిస్తోంది.2005, 2015 సంవత్సరం లో కూడా డిట్రాయిట్ లో తానా మహాసభలు జరిగిన విషయం విదితమే. ఇప్పుడు ఆ ఆనవాయితీకి కొనసాగిం పుగా 2025లో మహాసభలకు వేదికగా డిట్రాయిట్ నిలవడం విశేషం. డిట్రాయిట్ అయితే తెలుగు కమ్యూనిటీకి దగ్గరగా ఉంటుందని, వచ్చిన అతిధులకు వసతి సౌకర్యాలు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తరువాత ఇసి, బోర్డ్ డిట్రాయిట్ ను ఎంపిక చేసినట్లు రాజా కసుకుర్తి తెలియజేశారు.
ఈ తానా 2025 మహాసభలకు చైర్మన్ గా గంగాధర్ నాదెళ్ళను కూడా నియమించారు. తానాలో పాతతరానికి, కొత్త తరానికి బాగా పరిచయం ఉన్న గంగాధర్ నాదెళ్ళ ఈ మహాసభలను కూడా పర్యవేక్షించనున్నారు.
ఈ మహా సభల కో ఆర్డినేటర్ ఉదయకుమార్ చాపలమడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో జన్మించిన ఉదయ కుమార్ చాపలమడుగు తానాలో వివిధ కీలక పదవులను నిర్వహించారు. తానాతో ఎంతో అనుబంధం ఉన్న ఉదయ్ కుమార్ వచ్చే సంవత్సరం డిట్రాయిట్లో జరిగే తానా 2025 మహాసభలకు కో ఆర్డినేటర్గా వ్యవహరించనున్నారు. డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డిటిఎ) కార్య నిర్వాహక కమిటీలో అనేక పదవులను ఉదయ్ కుమార్ నిర్వహించారు. ముఖ్యంగా, బాగా గుర్తింపు పొందిన డిటిఎ 25వ మరియు 40వ వార్షికోత్సవాల నిర్వహణలో కన్వీనర్ గా ఆయన చేసిన కృషి అందరి ప్రశంసలను అందుకుంది. 2005 డిట్రాయిట్ తానా ద్వైవార్షిక సదస్సుకు డిప్యూటీ కోఆర్డినేటర్ గా కూడా ఆయన సేవలం దించారు. 2007లో తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ గా కూడా ఆయన పనిచేశారు.
ప్రముఖ నటుడు స్వర్గీయ శ్రీ తమ్మారెడ్డి చలపతి రావు గారి అల్లుడైన ఆయన, తన అద్భుతమైన ప్రసంగ నైపుణ్యాల ద్వారా తెలుగు ప్రజలలో విశేషంగా గుర్తింపు పొందారు. జూలై 2025 లో మెట్రో డెట్రాయిట్ లో జరగబోయే తానా 24 వ ద్వైవార్షిక సదస్సుకు కోఆర్డినేటర్ గా ఆయనను ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.