అమెరికాలో జన్మించే పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను సవాల్ చేస్తూ కోర్టుల్లో నాలుగు దావాలు దాఖలయ్యాయి. డెమాక్రటిక్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచిన 22 రాష్ర్టాలతో పాటు కొలంబియా జిల్లా, శాన్ ఫ్రాన్సిస్కో నగరం ట్రంప్ నిర్ణయాన్ని బోస్టన్, సియాటిల్ కోర్టుల్లో సవాల్ చేశాయి.
ట్రంప్ తన అధికార పరిధిని దాటారని, అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని దావాల్లో పేర్కొన్నాయి. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌తో పాటు పలు వలసదారుల సంఘాలు సైతం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి. ట్రంప్ నిర్ణయం అమలైతే అమెరికాలో ఏటా 1.50 లక్షల మంది పిల్లలకు పౌరసత్వాన్ని తిరస్కరించాల్సి వస్తుందని మసాచుసెట్స్ అటార్నీ జనరల్ అండ్రియా జాయ్ క్యాంప్‌బెల్ తెలిపారు. రాజ్యాంగ హక్కులను లాక్కునే అధికారం ట్రంప్‌నకు లేదని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.