ఆకృతి ఆధ్వర్యంలో, సారిపల్లి కొండలరావు సౌజన్యంతో ఈ నెల 24న నిర్వహించే కృష్ణవేణి శత వసంత మహోత్సవానికి సంబంధించిన ఆహ్వానప్రతిక ఆవిష్కరణ సభ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత, తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ మాట్లాడారు. తెలుగువారు గర్వించే విదూషీమణి, లెజెండ్ కృష్ణవేణి. నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా అడుగుపెట్టిన ప్రతి రంగంలో తనదైన ముద్రవేసిన మహనీయురాలు శ్రీమతి కృష్ణవేణి అని అన్నారు.ఎన్టీఆర్ లాంటి మహానటుడ్ని తెరకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిది. అంతేకాదు ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన తొలి సినిమా పల్లెటూరి పిల్ల కు నిర్మాత కూడా కృష్ణవేణిగారే. వందేళ్లు నిండిన ఆ మహాకళాకారిణికి తెలుగు సినిమా ఎప్పటికీ రుణపడివుంటుంది అని అన్నారు.
ఈ నెల 24న హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో ఆకృతి సంస్థ నిర్వహించే కృష్ణవేణి శత వసంత మహోత్సవ కార్యక్రమానికి పలువురు చిత్ర ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు అని ఆకృతి సుధాకర్ తెలిపారు.