విదేశీ పర్యాటకులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గుడ్న్యూస్ చెప్పింది. 60 రోజుల వ్యవధితో కూడిన టూరిస్ట్ వీసాల జారీని ప్రారంభించింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి పలు కొత్త వీసా విధానాలను అమలులోకి తీసుకువచ్చిన కువైత్ సర్కార్.. వాటికి ఊతమిచ్చేలా తాజాగా 60 రోజుల విజిట్ వీసాల జారీని ప్రారంభించిందని అక్కడి ట్రావెట్ ఏజెన్సీలు వెల్లడించాయి. స్మార్ట్ ట్రావెల్ ఎండీ అఫీ అహ్మద్ మాట్లాడుతూ, తమ ఏజెన్సీ ద్వారానే తాజాగా తొలి 60రోజుల గడువుతో కూడిన పర్యాటక వీసాను ఓ క్లయింట్కు జారీ చేసినట్లు పేర్కొన్నారు. దీనికి తాము 500 దిర్హమ్స్(రూ.11,220) చార్జీ చేస్తున్నట్లు తెలిపారు. ఇతర ట్రావెల్ ఏజెన్సీలు కూడా 60 రోజుల పర్యాటక వీసాల జారీ ప్రారంభమైనట్లు స్పష్టం చేశాయి. ఇప్పటికే తమ క్లయింట్లకు రెండు నెలల వ్యవధితో కూడిన విజిట్ వీసాలను అందుబాటులో ఉంచినట్లు ధీరా, స్మార్ట్ ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఇక ఈ నెల 3వ తేదీ నుంచి ప్రవేశపెట్టిన అడ్వాన్స్డ్ వీసా సిస్టమ్ యూఏఈ అతిపెద్ద రెసిడెన్సీ మరియు ఎంట్రీ పర్మిట్ సంస్కరణల్లో ఒకటి. 2022 ఏప్రిల్లో యూఏఈ మంత్రి మండలి ప్రకటించిన వివరాల ప్రకారం అన్ని ప్రవేశ వీసాలు వాటి జారీ తేదీ నుండి 60 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి.