యూకే, యూరప్ దేశాలలో అంగరంగ వైభవంగా టీటీడీ శ్రీనివాస కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. అంతేకాదు మరో మూడు నగరాలలో ఘనంగా దేవదేవుడి కళ్యాణం నిర్వహించారు. యూకే, యూరోప్ లలో ఘనంగా జరుగుతున్న శ్రీనివాస కళ్యాణోత్సవాలపై ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్. మేడపాటి విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవాలు గత వారంలో మూడు నగరాలలో జరిగాయి. నవంబర్ ౩వ తేదీన జర్మనీలోని మునిక్, 5వ తేదీన ఫ్రాంక్ఫర్ట్ 6వ తేదీన ఫ్రాన్స్ లోని పారిస్ నగరాలలో తితిదే నుంచి వెళ్లిన అర్చకులు, వేదపండితులు శ్రీనివాసుడి కళ్యాణం వైఖానస ఆగమం ప్రకారం ఘనంగా నిర్వహించారు. ఇప్పటి వరకు 9 నగరాలలో శ్రీవారి కళ్యాణాలు జరిగాయి.
మునిక్ నగరంలో వారం మధ్యలో శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కన్నులపండుగలా జరుగుతున్న ఈ కళ్యాణోత్సవాల్లో ఆయా నగరాల్లోని తెలుగు, భారతీయ, ధార్మిక సేవా సంస్థలు భక్తులకు ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఈవో వెంకటేశ్వర్లు, యూకే తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు కిల్లి సత్య ప్రసాద్, శివాలయం ఈ.వీ. సెంటర్ నుంచి శర్మ , మన తెలుగు అసోసియేషన్ సభ్యలు, ఇతరులు పాల్గొన్నారు.