యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం చెప్పాలని ఉంది. ఒక మాతృభాష కథ ఉపశీర్షిక. అరుణ్ భారతి ఎల్ దర్శకుడు. సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకంపై వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. తాజాగా ఈ సినిమాలోని నీ కోసం అనే పాట విడుదలైంది. మెలోడీ ప్రధానంగా సాగే ఈ గీతాన్ని కశ్మీర్‌లోని సుందరమైన లొకేషన్లలో చిత్రీకరించారు. ప్రేమికుల ఎడబాటును తెలియజెపుతూ ఈ పాట హృద్యంగా సాగింది. కృష్ణ చైతన్య సాహిత్యాన్నందించారు. మనసును తడిమే భావోద్వేగాలున్న ప్రేమకథ చిత్రమిదని, తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని దర్శకుడు తెలిపారు. సత్య, పృథ్వీ, మురళీశర్మ, సునీల్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచిందని సినీవర్గాలు తెలిపాయి. డిసెంబర్ 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.పి. సంగీతం: అస్లాంకీ, సంభాషణలు : విజయ్, సమర్పణ: ఆర్.బి. చౌదరి, రచన దర్శకత్వం: అరుణ్‌భారతి, కెమెరా : ఆర్‌పీ డీఎఫ్టీ.














