తెలంగాణలో బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. బీజేపీకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరికతో గత కొంతకాలంగా పార్టీకి పెద్దిరెడ్డి దూరంగా ఉంటున్నారు. అంతేగాక ఈటల రాకను పెద్దిరెడ్డి వ్యతిరేకించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీలో కొనసాగేందుకు నా మనసు అంగీకరించడం లేదంటూ పేర్కొన్న పెద్దిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా హుజురాబాద్‌లో పెద్దిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆయన నిరాశ చెందారు. ఈటల పార్టీలో చేరడంపై తనను ఎవరు సంప్రదించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక తాజాగా పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం కరీంనగర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరారు.