థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందన్న నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఆక్సిజన్ ప్లాంట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జగన్ సూచించారు. అలాగే కాన్సన్ ట్రేటర్లు, డీటైప్ సిలిండర్లపై కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వీటి కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలని, జిల్లాల్లో కూడా విస్తరించాలని పేర్కొన్నారు. 100 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాలని, ఇది ముగిసిన తర్వాతే ఇతర ఆస్పత్రులపై దృష్టి నిలపాలన్నారు. వ్యాక్సినేషన్లో టీచర్లకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానికి మరోసారి లేఖ రాస్తానని సీఎం జగన్ ప్రకటించారు. అయితే వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ అమలవుతున్న తీరును అధ్యయనం చేయాలని జగన్ ఆదేశించారు. వీటి ద్వారా ఏపీలో జరగాల్సిన మార్పులు, చేర్పులపై దృష్టి నిలపాలని సీఎం జగన్ ఆదేశించారు.