అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గతేడాది కూడా అమెరికాను చిగురుటాకులా వణికించిన ఈ మహమ్మారి మళ్లీ అక్కడ పడగ విప్పుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో అమెరికాలో దాదాపు లక్షన్నర కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఇంత భారీగా కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లోనే కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అమెరికా వ్యాప్తంగా వస్తున్న కొత్త కేసుల్లో మూడో వంతు ఈ రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. అమెరికాలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 3.35 కోట్లకు చేరింది. గత వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో అత్యధిక భాగంగా అమెరికా నుంచే ఉన్నట్లు ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.