ప్రపంచంలో అత్యంత సంపన్న గ్రామం ఎక్కడ ఉందో తెలుసా? ఆ గ్రామం మన దేశంలోనే ఉన్నది. గుజరాత్‌లో కచ్ జిల్లాలోని మాధపర్ గ్రామాన్ని వరల్డ్ రిచెస్ట్ విలేజ్‌గా అభివర్ణిస్తున్నారు. 40 వేల జనాభా వరకు ఉన్న ఆ గ్రామంలో 17 బ్యాంకులు ఉన్నాయి. అందులో ఏకంగా రూ.5 వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. తలసరి డిపాజిట్ రూ.15 లక్షలపైనే. ఇక, విలేజ్‌లో స్కూళ్లు, కాలేజీలు, డ్యామ్‌లు, పార్కులు, హోటళ్లు, దవాఖానలు అబ్బో ఒక్కటేమిటీ మెట్రో నగరాలను తలదన్నేలా సకల సౌకర్యాలు ఉన్నాయి. ఈ గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన చాలామంది బాగా సంపాదించారు. పుట్టిన ఊరుపై మమకారంతో సంపాదించిన డబ్బును ఇక్కడి బ్యాంకుల్లో దాచుకున్నారు. అలాగే, గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు తమ వంతుగా కోట్లల్లో విరాళాలు ఇస్తున్నారు. అందుకే మాధపర్ గ్రామం సుసంపన్న గ్రామంగా వర్ధిల్లుతున్నది.