విదేశీ విద్యార్థుల వలసను నియంత్రించేందుకు ఆస్ట్రేలియా గట్టి ప్రయత్నాలే చేస్తున్నది. అందుకోసం ఉన్నత విద్యా చదువుల నిమిత్తం వచ్చే విదేశీ విద్యార్థులకు కఠిన నిబంధన తెచ్చింది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ 29,710 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ఇది భారత్ కరెన్సీలో దాదాపు రూ.16.35 లక్షలు. ఈ నిబంధన ఈ నెల 10 నుంచి అమల్లోకి వస్తుంది. విదేశీ విద్యార్థుల బ్యాంకు బ్యాలెన్స్ ఆస్ట్రేలియా గత ఏడు నెలల్లో పెంచడం ఇది రెండోసారి. దీనివల్ల భారతీయ విద్యార్థులకు భారంగా పరిణమించనున్నది.
ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థులు, అక్కడ ఏడాదిపాటు నివాసం ఉండేందుకు అయ్యే ఖర్చుల మొత్తం తమ బ్యాంకు ఖాతాలో చూపాల్సి ఉంటుంది. గతంలో విదేశీ విద్యార్థుల వీసా డిపాజిట్ కనీసం 21,041 ఆస్ట్రేలియన్ డాలర్లు కాగా, గత అక్టోబర్‌లో 24,505 డాలర్లకు.. తాజాగా 29,710 డాలర్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది 19,576 అమెరికా డాలర్లకు సమానం.