సుధీర్‌బాబు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం హరోం హర. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989లో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్. హీరో సుధీర్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఓ పాటను మేకర్స్ విడుదల చేశారు.
మురుగడి మాయ అంటూ రాయలసీమ యాసలో సాగే ఈ పాటను భరద్వాజ పాత్రుడు రాయగా, చైతన్ భరద్వాజ్ స్వరపరిచారు. రఘు కుంచె ఆలపించారు. మురుగన్ శక్తిని వర్ణిస్తూ ఈ పాట సాగుతుందని, సంగీతం, సాహిత్యం, గానం ఇలా అన్ని విషయాల్లో ఈ పాట అందరికీ నచ్చుతుందని మేకర్స్ తెలిపారు. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్.