ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం రాయన్. కళానిథిమారన్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్స్ విడుదల చేయనుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడారు. సరైన సమయంలో సరైన అవకాశాలు వచ్చాయి కాబట్టే ఈ స్థాయిలో ఉన్నా. నా ఎదుగుదలకు కారణం నా దర్శకులే. నా తప్పుల్ని కూడా ఇష్టపడ్డారు, క్షమించారు, తీర్చిదిద్దారు. వారి దీవెనల వల్లే ఇది సాధ్యమైంది. దర్శకత్వం అంటే ఇష్టం. అది బాధ్యత కూడా. అందుకే కాస్త భయంగా ఉంది. ఏఆర్ రెహమాన్, ప్రకాశ్‌రాజ్, ఎస్‌జెసూర్య, శరవణన్ ఇంకా నా టెక్నికల్ టీమ్ అందరూ నన్ను నమ్మి పనిచేశారు. కళానిథిమారన్ నన్ను నమ్మి ఖర్చుపెట్టారు. రాయన్ మంచి సినిమా. తమిళ ఆడియన్స్‌తోపాటు తెలుగువాళ్లకు కూడా నచ్చుతుందని నా నమ్మకం అని అన్నారు.
ధనుష్ తనకోసం రాసుకున్న పాత్రను నాతో చేయించారు. ఆయన కోసం రాసుకున్న పాత్రను ఆయన దర్శకత్వంలో నేను చేయడం నా కెరీర్‌లో మరిచిపోలేని విషయం. బాధ్యతగా తీసుకొని ఈ పాత్ర చేశా అని సందీప్‌కిషన్ తెలిపారు. మనకున్న నటుల్లో ధనుష్ అరుదైన నటుడని ప్రకాశ్‌రాజ్ కొనియాడారు. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కథానాయికలు అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాళిదాస్ జయరామ్, డి.సురేశ్‌బాబు, దిల్‌రాజు, ఏషియన్ సునీల్, గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు.