భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. భారత పర్యాటకులు, నిపుణులైన కార్మికులు, విద్యార్థుల కోసం అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్లను ప్రారంభిస్తున్నట్టు భారత్‌లోని అమెరికా ఎంబసీ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇటీవల కొత్త స్లాట్‌లను విడుదల చేశామని, అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వేలమంది భారతీయులు సకాలంలో ఇంటర్వ్యూలను పొందేందుకు ఇవి ఎంతో దోహదం చేయడంతోపాటు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నది.
వరుసగా రెండో ఏడాది కూడా 10 లక్షల వలసేతర (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసా దరఖాస్తులను అధిగమించామని, ఇప్పుడు కుటుంబాలను, వ్యాపారులను కలపడంతోపాటు పర్యాటకాన్ని సులభతరం చేయడంపై దృష్టి సారించామని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.