గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యుటీసీఎస్) స్వర్ణోత్సవ వేడుకలు చరిత్రలో నిలిచిపోతా యని అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. ఈ ఉత్సవంలో అతిరథ, మహారథులైన పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యనపాత్రుడుకి, జీవన సాఫల్య పురస్కారాన్ని సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం, మాజీ తానా అధ్యక్షుడు, తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సతీష్ వేమన అందించారు. సన్మాన గ్రహీత అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ వేలాది తెలుగు వారి సమక్షంలో స్వర్ణోత్సవ వేడుకల శుభవేళ పురస్కారానికి ధన్యవాదములు తెలుపుతూ, మనమంతా రాష్ట్ర ప్రగతి కి, మాతృభూమి, మాతృభాష పరిరక్షణకై కలిసి ముందుకెళదామని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమానికి చిన్న, మధ్యతరగతి పరిశ్రమల శాఖ, విభాగం మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సీనియర్ శాసన సభ్యుడు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హాజరయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐలు ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రగతికి కట్టుబడివున్నారని, రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు పెట్టటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీనియర్ శాసన సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ తెలుగువారి సత్తా చాటిన అన్న ఎన్టీఆర్ స్ఫూర్తికి మనమంతా వారసులమని, మరో యాభైఏళ్లు ఈ సంస్థ ప్రస్థానం సాగాలని, రాష్ట్ర ప్రగతికి ప్రవాసులు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి, సతీష్ వేమన , గంగాధర్ నాదెళ్ల ప్రసంగిస్తూ మాతృభూమి, మాతృబాష కాపాడుకోవటం మన భాద్యత అని అన్నారు.
కళ, సాహిత్య, నృత్య, క్రీడా రంగాలలో నిర్వహించిన పోటీలు, యువతకు ప్రోత్సాహం, విజేతలకు బహుమతులు, రంగస్థల సామ్రాట్ గుమ్మడి గోపాలకృష్ణ చిన్నారుల పద్య నాటకం, జొన్నవిత్తుల సాహిత్యం, సాయి కాంత ఆరంభ గీతం, రెండు రోజుల పాటు 50 రకాల తెలుగింటి వంటకాలతో అందించిన విందు, స్వర బ్రహ్మ మణిశర్మ సంగీత విభావరి, ఇలా ఎన్నో విశేషాలతో వేలాది మందిని రెండు రోజులూ కట్టి పడేసింది, పాల్గొన్న సభ్యులకూ, దాతలకు, విజేతలకు, అతిథులకు, పనిచేసిన వారందరికీ అధ్యక్షుడు కృష్ణ లాం హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.