అమెరికాలో అరుదైన సంఘటన జరిగింది. 45 నిమిషాల పాటు గుండె ఆగిపోయిన తర్వాత ఓ మహిళ మళ్లీ ఊపిరి తీసుకొని మృత్యుంజయురాలిగా నిలిచింది. టెక్నాస్‌లోని హ్యూస్టన్‌కు చెందిన మారిసా క్రిస్టీ అనే మహిళ గర్భవతి. ఆగస్టు 21న విడ్‌లాండ్స్ మెడికల్ సెంటర్‌లో సీ-సెక్షన్ ద్వారా ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం విషమించి స్పృహ కోల్పోయింది. ఆమె గుండె ఆగిపోయిందని, ఊపిరి తీసుకోవడం లేదని గుర్తించిన వైద్యులు వెంటనే సీపీఆర్ ప్రారంభించారు. యంత్రం ద్వారా కృత్రిమంగా రక్తాన్ని పంపింగ్ చేశారు.
వైద్యులు తీవ్రంగా శ్రమించిన తర్వాత 45 నిమిషాలకు మళ్లీ ఆమె గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. వారం పాటు ఎక్మోపైన చికిత్స అందించిన తర్వాత పూర్తిగా కోలుకున్నది. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం అనే అరుదైన, ప్రాణాంతక సమస్య కారణంగానే క్రిస్టీ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నట్టు వైద్యులు తెలిపారు.