రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదురుతున్నది. రష్యాలోని సుదూర ప్రాంతాలపై దాడికి అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు వినియోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతివ్వడం ఉద్రిక్తతలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
కీవ్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు అమెరికాకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఎంబసీని మూసివేయాలని నిర్ణయించారు. నవంబర్ 20న దాడి జరిగే అవకాశం ఉందని తమకు కచ్చితమైన సమాచారం వచ్చిందని అమెరికా తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అందులో పనిచేసే ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అదేవిధంగా ఎయిర్ అలర్ట్‌లు ప్రకటించగానే కీవ్‌లోని అమెరికా పౌరులు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని సూచించింది.