ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏండ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియో గించకుండా నిషేధాన్ని విధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఆమోద ముద్ర వేసింది. బిల్లును సభలో ప్రవేశపెట్టగా 102 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. మెజారిటీ పార్టీలన్నీ బిల్లుకు అనుకూలంగా ఓటెయ్యగా, 13 మంది సభ్యులు మాత్రం వ్యతిరేకించారు. ఇక సెనేట్‌లో ఆమోదం లభించిన వెంటనే బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.
16 ఏండ్ల లోపు పిల్లల సామాజిక మాధ్యమ ఖాతాలను నిరోధించడంలో వ్యవస్థాగతంగా విఫలమైతే సామాజిక మాధ్యమాలకు 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించారు. అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.273 కోట్లకు పైమాటే. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్ చాట్, రెడిట్ తదితర మాధ్యమాలకు ఈ చట్టం వర్తించనుంది. కాగా, బిల్లు చట్ట రూపం దాల్చితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డుకెక్కనుంది.