భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, దాదాపు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి మొదటిసారి బయటకు అడుగుపెట్టారు. ఐఎస్‌ఎస్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తున్న ఆమె, మరో వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి స్పేస్‌వాక్ చేశారని నాసా తెలిపింది. ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన తర్వాత ఇద్దరు వ్యోమగాములకు ఇది మొదటి స్పేస్‌వాక్ కాగా, సునీత విలియమ్స్‌కు ఇది 8వ సారిగా నాసా పేర్కొన్నది.
కేవలం వారం రోజుల అంతరిక్ష యాత్ర నిమిత్తం సునీత విలియమ్స్, విల్మోర్‌లను గత ఏడాది జూన్‌లో ఐఎస్‌ఎస్‌కు పంపారు. తిరుగు ప్రయాణంలో బోయింగ్ స్టార్‌లైనర్ కు సాంకేతిక లోపం తలెత్తటంతో, వ్యోమగాములు ఐఎస్‌ఎస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 10 నెలల తర్వాత ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో వారిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.