అక్రమ వలసల అణచివేతే లక్షంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. అక్రమ వలస దారుల బహిష్కరణకు సంబంధించిన కీలక బిల్లుకు తాజాగా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అధ్యక్షుడిగా ట్రంప్ సంతకం చేసే తొలి బిల్లు ఇదే అయ్యే అవకాశం ఉంది. దొంగతనాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని అదుపు లోకి తీసుకునేలా రూపొందించిన ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత కాంగ్రెస్ ఆమోదించిన అత్యంత ముఖ్యమైన ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బిల్లు ఇదే అని అలబామా రిపబ్లికన్ సెనేటర్ కేటీ బ్రిట్ పేర్కొన్నారు. అయితే ఈ బిల్లు అమలుకు ప్రస్తుతం ఉన్న నిధులు సరిపోవని ఫెడరల్ అధికారులు హెచ్చరించారు. దీంతో బిల్లు ఆమలుకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.