అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గల సంపన్నుల నగరం లాస్ ఏంజెల్స్ లో కార్చిచ్చు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో వేలాది నిర్మాణాలను బూడిద చేసింది. అయితే, ఈ కార్చిచ్చు ఇంకా చల్లారడం లేదు. గాలుల తీవ్రతకు కొత్త ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ వైల్డ్‌ఫైర్ కారణంగా లాస్ ఏంజెల్స్ మరభూమిని తలపిస్తోంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, విలువైన సామగ్రి మంటల్లో కాలిబూడిదయ్యాయి. చాలా మంది ధనవంతులు, సెలబ్రిటీలు తమ సామాన్లు, కార్లను ఇళ్లలోనే వదిలేసి బతుకుజీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
ఈ నేపథ్యంలో లాస్ ఏంజెల్స్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సందర్శించారు. ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ తో కలిసి అక్కడికి చేరుకున్న ట్రంప్, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ తో భేటీ అయ్యారు. కార్చిచ్చు వల్ల బూడిదైన ప్రాంతాలను పరిశీలించారు. సహాయక చర్యల గురించి గవర్నర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అన్ని విధాలా అండగా నిలబడతామని ట్రంప్ హామీ ఇచ్చారు.