సాంకేతికతను వినూత్నంగా వినియోగించిన గ్రామీణ విద్య గతిని మార్చిన రాజస్థాన్‌కు చెందిన మార్గదర్శక విద్యావేత్త మొహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ మేవాతీ జెమ్స్ ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్‌ప్రైజ్ 2025 రేసులో నిలిచాడు. ఈమేరకు తుది పదిమంది జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ఈ బహుమతికి ఎంపికైన వ్యక్తికి సుమారు రూ.8.65 కోట్లు (10 లక్షల అమెరికన్ డాలర్లు ) లభించనున్నాయి. తరగతి గదులకే పరిమితం కాకుండా మౌలిక సదుపాయాల సవాళ్లను పరిష్కరించడం, వందల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, పర్యావరణ సారధ్యాన్ని పెంపొందించడం వంటి పనులకు గాను మేవాతీకి ప్రధాని నరేంద్రమోడీ నుంచి సహా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.
అతని అంకిత భావం పరివర్తనాత్మక విద్యకు ఉదాహరణగా, స్థానిక కమ్యూనిటీలకు స్ఫూర్తిగా నిలుస్తోందని, గ్లోబల్ టీచర్ ప్రైజ్ ప్యానల్ కొనియాడింది. జెమ్స్ ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 కు సంబంధించి తుది పదిమందిలో చోటు దక్కించుకోవడంపై మేవాతీ స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత స్ఫూర్తిమంతమైన విద్యావేత్తల సరసన నిలబడడం గౌరవంగా భావిస్తున్నట్టు వెల్లడించారు.