Namaste NRI

సత్యసాయి బాబా బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయి: మోదీ

పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి స్మారక నాణం విడుదల చేశారు. అనంతరం మోదీ ప్రసంగించారు. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా, ఆయన ప్రేమ మనతోనే ఉందని చెప్పుకొచ్చారు. సత్యసాయి బాబా బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయని కొనియాడారు.

ప్రేమ, శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన సత్యసాయిదని తెలిపారు. విశ్వశాంతి, విశ్వసేవను బాబా మనకు చాటి చెప్పారని అన్నారు. మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని సత్యసాయి చెప్పారని గుర్తుచేశారు. అందరినీ ప్రేమించాలి, అందరికీ సేవ చేయాలి, ఇదే బాబా నినాదమని వివరించారు. గుజరాత్ భూకంపం వచ్చినప్పుడు బాబా సేవాదళ్ సేవలందించిందని గుర్తుచేశారు. పేదలకు ఎప్పుడు ఆపద వచ్చినా, బాబా సేవాదళ్ ఆదుకుంటుందని ప్రశంసించారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలందించారనిపేర్కొన్నారు.

ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపమన్నారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేది శ్రీసత్యసాయి చూపిన దారి అని చెప్పుకొచ్చారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారని అన్నారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శతజయంతి వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారని, అలాగే ఫలితం చూపించారని వెల్లడించారు.
ప్రేమ ఒక్కటే మతం, హృదయం ఒక్కటే భాష, మానవత్వమే కులం, అన్నిచోట్లా దైవం ఉందని బోధించారని గుర్తుచేశారు. నాస్తికులను కూడా ఆధ్యాత్మికత వైపు నడిపించారన్నారు. వేర్వేరు దేశాలు వేర్వేరు ప్రాంతాల ప్రజలను మనో దర్శనంతో ప్రభావితం చేశారని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే ఆయన భావనతో శ్రీ సత్యసాయి భక్తులు మానవాళికి సేవలు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Social Share Spread Message

Latest News