భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్రపతి భవనంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఆయన హిందీలో దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు. ఆయనను సీజేఐగా అక్టోబర్ 30న నియమించారు. ఈ పదవిలో ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకు దాదాపు 15 నెలలపాటు కొనసాగుతారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. జస్టిస్ కాంత్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోదీ వద్దకు వెళ్లి, నమస్కరించారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. చిన్న పట్టణంలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత అంచెలంచెలుగా దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవిని చేపట్టారు.

పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా అనేక ముఖ్యమైన తీర్పులిచ్చారు. ఆ తర్వాత 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా, ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత జస్టిస్ బీఆర్ గవాయ్ సీజేఐ అధికారిక కారును జస్టిస్ సూర్యకాంత్‌కు అప్పగించారు. సీజేఐ హోదాలో జస్టిస్ కాంత్ సుప్రీంకోర్టుకు అధికారిక కారులోనే వెళ్లాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేశారు. నిబంధనల ప్రకారం సీజేఐగా పదవీ విరమణ చేసిన అనంతరం మాజీ సీజేఐలు తాము ఉంటున్న అధికారిక నివాసాలను, ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను వీడాల్సి ఉంటుంది.
















