Namaste NRI

వినోదంతో పాటు సందేశమున్న చిత్రమిది : సుకుమార్‌

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకురాలు. నవీన్‌ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు నిర్మాతలు. గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సుకుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ చిన్నప్పటి నుంచి సుకృతికి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. యాక్టింగ్‌ మీద ఎప్పుడూ ఇంట్రెస్ట్‌ చూపలేదు. నా ముందు గారాలు పోయే సుకృతి ఎలా యాక్ట్‌ చేస్తుందో అనే చిన్న సందేహం ఉండేది. కానీ ఈ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించింది. దర్శకురాలు కథ ఎంత గొప్పగా రాసుకుందో అంతే గొప్పగా సినిమా తీసింది. మనుషుల్ని మూడు గంటలు కూర్చొబెట్టి ఎంటర్‌టైన్‌ చేస్తే ప్రపంచంలో ఆ మూడు గంటలు క్రైమ్‌ తగ్గుతుందని నేను నమ్ముతాను. నా దృష్టిలో ఎంటర్‌టైన్‌మెంటే సందేశం. ఆర్ట్‌ని బిజినెస్‌గా చేసుకుంటేనే సినిమాల్లోకి వెళ్లు.

మనుషులు ఆనందం కోసమే బతుకుతారు. ఆనందాన్నిచ్చే ఎంటర్‌టైన్‌మెంటే నీ సందేశం అనుకో  అని సినిమాల్లోకి వచ్చే ముందు మా గురువుగారు చెప్పిన మాటలతో బాగా రియలైజ్‌ అయ్యాను. వినోదంతో పాటు సందేశం ఉంటే అది సినిమాకు బోనస్‌. గాంధీ తాత చెట్టు అదే కోవకు చెందుతుంది అన్నారు. చెట్టుకి, మనిషికి మధ్య ప్రేమకథ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచే కథ పుట్టిందని దర్శకురాలు చెప్పారు. మంచి కంటెంట్‌ ఉన్న ఈ సినిమాను ఆదరించాలని నిర్మాతలు నవీన్‌ ఏర్నేని, వై.రవిశంకర్‌ కోరారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News