చంద్రుడిని మానవులకు నివాసయోగ్యంగా మార్చే దిశగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేపట్టారు. మానవ మనుగడకు కీలకమైన నీటి వనరులను సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఏఎస్)లోని నింగ్‌బో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ కు చెందిన శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలం నుంచి సేకరించిన మట్టి నుంచి నీటిని వెలికితీశారు.
చాంగ్ ఈ-5 మిషన్‌లో భాగంగా చంద్రుడి ఉపరితలం నుంచి తెచ్చిన మట్టిని 1,200 కెల్విన్‌కు పైగా వేడి చేసి, ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా నీటిని తీసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక టన్ను మట్టితో దాదాపు 500 లీటర్ల తాగు నీటిని తయారుచేయవచ్చని వీరు పేర్కొన్నారు. చంద్రుడిపై మట్టి నుంచి తయారుచేసిన నీటిని హైడ్రోజెన్, ఆక్సిజన్‌గా కూడా వేరు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.