అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ-అమెరికన్ విద్యార్థులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అల్ఫారెట్టా నగరంలో వేగంగా వెళ్తున్న ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అందరూ 18 ఏండ్ల వయసు గల వారు కావడం గమనార్హం. మృతిచెందిన విద్యార్థులను శ్రియా అవసరాల, ఆర్యన్ జోషి, అన్వి శర్మలుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో రిత్విక్ సోమేపల్లి, మహ్మద్ లియాకత్ గాయపడ్డారు. బాధిత విద్యార్థులు అల్ఫారెట్టా హైస్కూల్, యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో చదువుకొంటున్నారు. కారు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.