అమెరికాలో అమలులో ఉన్న ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్సీపీఏ)ను నిలిపివేయాలని న్యాయ శాఖను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు. ఈ చట్టం వినడానికి బాగానే ఉన్నా దేశానికి నష్టం చేస్తున్నదని, జైలు భయంతో అమెరికా కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకోలేకపోతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికన్ కంపెనీలు అంతర్జాతీయంగా చట్టాలను ఉల్లంఘనలకు పాల్పడకుండా 1977లో అమెరికా ఈ చట్టాన్ని చేసింది. అమెరికాలో లంచాలు ఇచ్చే విదేశీయులు, విదేశీ సంస్థలను కూడా ఈ చట్టం పరిధిలోకి తెస్తూ 1998లో సవరించారు.
ఎఫ్సీపీఏను నిలిపివేయడం గౌతమ్ అదానీకి భారీ ఊరట కలిగించనుంది. అదానీ, ఆయన అనుచరులు భారత్లో విద్యుత్తు కాంట్రాక్టులు పొందేందుకు భారతీయ అధికారులకు భారీగా లంచాలు ఎర వేశారని గత ఏడాది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్(డీఓజే) ఈ చట్టం కిందనే అభియోగాలు మోపింది. అదానీ సంస్థల్లో కొందరు పెట్టుబడిదారులు అమెరికన్లు కావడంతో ఈ చట్టం వర్తించింది.ఇప్పుడు ఈ చట్టాన్నే నిలిపివేస్తూ ట్రంప్ ఉత్తర్వులు ఇవ్వడంతో అదానీ సంస్థపై విచారణ నిలిచిపోయే అవకాశం ఉంది.కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ఒక రోజు ముందు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నెల 12, 13 తేదీల్లో మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/gautamadani-300x160.jpg)