రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్రదాడి ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 60 మందికిపైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఐఎస్‌ఐఎస్ ప్రకటించింది. అయితే ఈ ఉగ్రదాడి ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నెల రోజుల క్రితమే రష్యాను హెచ్చరించినట్లు తెలిపింది.
మాస్కోలో ఉగ్ర ఘటనపై వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి అడ్రియెన్నీ వాట్సన్ మాట్లాడుతూ మాస్కోలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నెల రోజుల క్రితమే అమెరికా ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు చెప్పారు. కాన్సర్ట్‌లు, ప్రజలు ఎక్కువగా గుడిగూడే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని వాషింగ్టన్ వెంటనే రష్యా అధికారులకు అందించినట్లు తెలిపారు. ఏదైనా నిఘా సమాచారం అందిన వెంటనే అమెరికా ఆయా దేశాలను అలర్ట్ చేస్తుందని ఈ సందర్భంగా వాట్సన్ పేర్కొన్నారు.