ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన గ్రీన్ కార్డుల కోటా మొత్తాన్ని వినియోగించుకున్నట్టు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ శాఖ తాజాగా పేర్కొంది. సెప్టెంబర్ 30 నాటికి 2,81,507 ఉద్యోగ అధారిత గ్రీన్ కార్డులు జారీ అవుతాయని తెలిపింది. ఈ పరిణామంపై అమెరికాలోని వలస సేవల లాయర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో గ్రీన్ కార్డుల జారీకి సిద్ధమవడం సామాన్య విషయం కాదని ఓ న్యాయవాది వ్యాఖ్యానించారు. సిబ్బంది, ఉన్నతాధికారులు విపరీతంగా శ్రమిస్తేనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఏటా జారీ చేసే గ్రీన్ కార్డుల కంటే ఈసారి రెట్టింపు సంఖ్యలో గ్రీన్ కార్డులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఏజెన్సీలు ఎన్నో అడ్డంకులను అధిగమించాయి అని తెలిపారు.
