వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలకు చెక్ పెట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. 2025 ఆర్థిక సంవత్సరానికి జారీచేసే హెచ్-1బీ వీసాల లాటరీ ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు కొత్త నిబంధనలు ప్రకటించింది. దీంతో ఇకపై వీసా కోసం ఎవరు ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా ఒకే దరఖాస్తుగా పరిగణిస్తారు. ఒకే వ్యక్తి తరఫున అనేక దరఖాస్తులు సమర్పించి లాటరీ విధానంలో ప్రయోజనం పొందేందుకు పలు కంపెనీ లు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. పిటిషన్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా దరఖా స్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి దరఖాస్తుదారుడు సరైన పాస్‌పోర్టు వివరాలు, ప్రయాణ పత్రాలను విధిగా సమర్పించాల్సి ఉంటుందని, తప్పుడు సమాచారం ఉన్న దరఖాస్తులను తిరస్కరించే అధికారం యూఎస్‌సీఐఎస్‌కి ఉంటుందని స్పష్టం చేసింది. 2025 వీసాల తొలి రిజిస్ట్రేషన్ మార్చి 6 నుంచి 22 వరకు కొనసాగుతుందని తెలిపింది.